kuchipudi sambasiva rao: నాడు వైఎస్ కు అత్యంత ఆప్తులు... నేడు టీడీపీ వైపు చూస్తున్న దంపతులు!
- టీడీపీలో చేరనున్న కూచిపూడి సాంబశివరావు, విజయ
- గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేసిన సాంబశివరావు
- గుంటూరు జడ్పీ చైర్మన్ గా సేవలందించిన విజయ
- దంపతులతో చర్చిస్తున్న రాయపాటి, నక్కా
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులుగా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు, విజయ దంపతులు ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే నిజమే అనిపిస్తోంది. ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని, చంద్రబాబు సమక్షంలో వీరు అతి త్వరలోనే తెలుగుదేశంలో చేరుతారని తెలుస్తోంది.
కాగా, గతంలో వైఎస్ ఆశీస్సులతో కూచిపూడి సాంబశివరావుకు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పదవి దక్కింది. ఆయన భార్య విజయను గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించింది. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు తొలి రోజు నుంచి ఆయనతో పాటు నడిచిన చరిత్ర సాంబశివరావుది. ఆ కారణంతోనే వైఎస్ సీఎం కాగానే, సాంబశివరావుకు నామినేటెడ్ పోస్టును, విజయకు జడ్పీ చైర్మన్ పదవిని ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.
నాగార్జున వర్శిటీలో బోటనీ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె, వైఎస్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చారు. వైెఎస్ మరణానంతరం ఈ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని భావించినా, వారు ఆ పని చేయలేదు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిని టీడీపీలో చేర్చితే, దుగ్గిరాల ప్రాంతంలో పార్టీ మరింత బలపడుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.