paytm: పేటీఎం నుంచి మెసేజింగ్ సేవల యాప్... వాట్సాప్‌కి పోటీ?
- వినియోగదారులు, విక్రయదారుల మధ్య సమన్వయం కోసమే
- ఇన్‌బాక్స్ పేరుతో సర్వీస్ ప్రారంభం
- ఒకేసారి చాటింగ్, లావాదేవీలు
దేశంలో అతిపెద్ద పేమెంట్ యాప్ పేటీఎం మెసేజింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌బాక్స్ పేరిట మెసేజింగ్ సర్వీసును పేటీఎం ప్రారంభించింది. దీని సహాయంతో ఒకేసారి లావాదేవీలు, చాటింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు, విక్రయదారుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకే ఈ మెసేజింగ్ సేవను ప్రారంభించినట్లు పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ తెలిపారు.
అయితే కేవలం మెసేజ్‌లే కాకుండా ప్రస్తుతం వాట్సాప్‌లో ఉన్న అన్ని రకాల సదుపాయాలు అంటే ఫొటోలు, వీడియోలు, లైవ్ లొకేషన్, క్యాప్చర్, షేర్ మూమెంట్లను కూడా ఇన్‌బాక్స్ ద్వారా పంపుకునే సదుపాయం ఉంది. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్‌కి పోటీగా ఈ సర్వీసును పేటీఎం ప్రవేశపెట్టిందేమోనన్న అనుమానం కలుగుతోంది. అంతేకాకుండా ఇందులో నోటిఫికేషన్లు, ఆర్డర్లు, గేమ్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వివరాలను చూసుకోవచ్చు.
ఒకవైపు యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పేటీఎం, వాట్సాప్‌కి మెసేజింగ్ సర్వీస్ రూపంలో గట్టి పోటీని పెంచడం గమనార్హం. ఈ రెండు యాప్‌ల మధ్య ఇలాంటి పోటీ పెరిగితే ఆఫర్లు వెల్లువెత్తి వినియోగదారులు లాభపడే అవకాశం ఉంది.