whatsapp: ప్లే స్టోర్‌లో నకిలీ వాట్సాప్ యాప్‌లు... డౌన్‌లోడ్ చేసుకోవద్దంటున్న నిపుణులు
- వాట్సాప్ బిజినెస్, అప్‌డేట్ వాట్సాప్ మెసెంజర్ పేరుతో నకిలీ యాప్‌లు
- డౌన్‌లోడ్‌ల సంఖ్యను గమనించాలని సూచన
- మాల్‌వేర్ సోకే అవకాశముందని హెచ్చరిక
రోజుకో అప్‌డేట్ ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్న వాట్సాప్ ప్రయత్నాలను అడ్డదారిలో సొమ్ము చేసుకోవడానికి కొంతమంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ పేరుతో ఉన్న కొన్ని నకిలీ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఫీచర్లను వినియోగించుకోవడానికి వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. ఇందుకోసం ప్లే స్టోర్‌కి వెళ్లినవారికి 'అప్‌డేట్ వాట్సాప్ మెసేంజర్' అనే యాప్ కనిపిస్తుంది. ఇది నకిలీ యాప్. వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోనక్కరలేదు. అలాగే త్వరలో వాట్సాప్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్ బిజినెస్ సౌకర్యానికి సంబంధించి కూడా ఒక నకిలీ యాప్ ప్లేస్టోర్‌లో ఉంది. 'వాట్సాప్ బిజినెస్' పేరుతో ఉన్న ఈ యాప్ కూడా నకిలీది. ఎందుకంటే బిజినెస్ సర్వీసులను భారతదేశంలో వాట్సాప్ ఇంకా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టలేదు.
ఈ నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే స్మార్ట్‌ఫోన్‌కి ప్రమాదం కలిగించే మాల్‌వేర్ల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు కంపెనీ పేరును, ట్రస్టెడ్ వివరాలను, డౌన్‌లోడ్‌ల సంఖ్యను గమనించాలని నిపుణులు చెబుతున్నారు.