potla nageswar rao: టీఆర్ఎస్ లో ఉండలేకపోతున్నా.. కాంగ్రెస్ లో చేరుతున్నా: పోట్ల
- తుమ్మలతో కలసి టీఆర్ఎస్ లో చేరిన పోట్ల
- కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోందంటూ విమర్శలు
- పోట్లకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. 8వ తేదీన కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన నిజాం ఏలుబడిని తలపిస్తోందని... సెక్రటేరియట్ కు కూడా రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు.
కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి, ఇటీవల ఆ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిల ప్రోత్సాహంతోనే పోట్ల పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం. గత ఐదారురోజులుగా వీరిద్దరితో పోట్ల చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో పోట్లకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
2015 వరకు టీడీపీలో పోట్ల నాగేశ్వరరావు కొనసాగారు. సీనియర్ నాయకుడిగా పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరినప్పుడు, ఆయనతో కలసి కారెక్కారు.