tomato: భలే మంచి చౌక బేరం.. ఢిల్లీలో కేజీ టమోటాలు రూపాయే.. జుగ్నూ యాప్ సంచలన ప్రకటన!
- ఢిల్లీలో కేజీ టమోటాలు వంద రూపాయలు
- జుగ్నూ యాప్ సంచలన 'టమోటా లూట్' ఆఫర్
- రూపాయికే కేజీ టమోటాలు ఇస్తారట!
ఖరీఫ్ సీజన్ కావడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లకు వెళ్లినా జేబులు గుల్లవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో టమోటాల ధరలు మరింత మండిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో మరీ అంతలా కాకున్నా సాధారణ ధరకంటే రెండింతలు ఎక్కువ పలుకుతోంది. ఈ నేపథ్యంలో జుగ్నూ యాప్ కేజీ టమోటాలను కేవలం రూపాయి ధరకే అందించేందుకు ముందుకు వచ్చింది. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఈ సంస్థ సీఈవో సమర్ సింగ్లా తెలిపారు.
'జుగ్నూ యాప్' అనేది ఓ ఆన్ - డిమాండ్ హైపర్ లోకల్ ట్రాన్స్ పోర్టు, లాజిస్టిక్స్ యాప్. టమోటాల సరఫరాను పెంచి, ధరలను తగ్గిస్తున్నామని అన్నారు. కూరగాయల ధరలను చూసి ప్రజలు నిరుత్సాహపడకూడదన్న లక్ష్యంతో ఈ ఆఫర్ ప్రకటించామని ఆయన వెల్లడించారు. ‘టమోటా లూట్’ పేరుతో రూపాయికే కేజీ టమోటాల ఆఫర్ ను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. రెండేళ్ళ క్రితం ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కూడా ఇలాగే తక్కువ ధరలకు విక్రయించామని తెలిపారు. మార్కెట్ లో సంచలనం సృష్టించేందుకు, కస్టమర్లను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.