harassment: చదువు కోవడమే యువతి చేసిన నేరం... నడిబొడ్డున దుశ్శాసన పర్వం!
- డిగ్రీ చదవొద్దని యువతిని హెచ్చరించిన గ్రామస్థులు
- హెచ్చరికలు పక్కనబెట్టి బిఏ పార్ట్ 2లో చేరిన యువతి
- యువతిని వివస్త్రను చేసి, లైంగికంగా వేధించి, దాడి చేసిన గ్రామస్థులు
బీహార్ లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. చదువుల తల్లిని వివస్త్రను చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటంటే... ఆ యువతి ఉన్నతవిద్యనందుకోవాలని భావించడమే! దర్భాంగాకు చెందిన బాధిత యువతి బాగా చదువుకుంటోంది. మరింత బాగా చదివి ఉన్నత స్థాయినందుకోవాలని భావించింది. ఇది ఆ గ్రామస్థులకు కంటగింపుగా మారింది.
దీంతో ఆమెను ఉన్నత విద్యనభ్యసించవద్దని చెబుతూ హెచ్చరికలు చేశారు. వారి హెచ్చరికలను లెక్కచేయని యువతి బీఏ పార్ట్ 2లో చేరింది. హెచ్చరించినా చదువు ఆపలేదన్న కారణంతో గ్రామం నడి రోడ్డున, పట్టపగలు ఆమెను వివస్త్రను చేసి లైంగిక వేధింపులకు దిగి, దాడి చేశారు. ఆమెను కాపాడేందుకు ముందుకు వచ్చిన తండ్రిని కూడా చావబాదారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో వారు ఎస్ఎస్పీ సత్యవీర్ సింగ్ ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామంలోని 13 మందిపై కేసులు నమోదు చేశారు.