america: భారతీయులు, చైనీయులు.. మా నగరాన్ని విడిచి వెళ్లండి!: అమెరికన్ల కొత్తవాదం
- నిన్నటి వరకు అమెరికా వినిపించిన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదం
- న్యూజెర్సీలో పురుడు పోసుకున్న 'మేక్ ఎడిసన్ గ్రేట్ అగైన్' నినాదం
- భారతీయులు, చైనీయులు దేశం విడిచి వెళ్లాలంటూ కరపత్రాలు
అమెరికాలో నిన్న మొన్నటి వరకు వినిపించిన నినాదం 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్'. అయితే తాజాగా 'మేక్ ఎడిసన్ గ్రేట్ అగైన్' అనే నినాదం వినిపిస్తోంది. అమెరికాలో నల్లజాతీయులు, ముస్లింలంతా నేరగాళ్లు అనే వాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. దీనిపై అక్కడ పెద్ద పోరాటాలే జరుగుతున్నాయి. అమెరికా సైన్యంలో కూడా వారు సేవలందించారన్న విషయాన్ని మరువొద్దని మానవతావాదులు, హక్కుల కార్యకర్తలు సూచిస్తూనే ఉన్నారు. అయినా వారిపై జాతి విద్వేషాలు అంతం కావడం లేదు. అయితే ఈ సారి జాతి విద్వేషం భారతీయులు, చైనీయుల దిశగా మళ్లింది.
అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ లోని ఎడిసన్ నగరాన్ని ఇండియన్స్, చైనీస్ ఆక్రమించుకుంటున్నారని, ఇంతవరకు జరిగింది చాలని హితవు పలుకుతూ, తమ నగరాన్ని ఇకనైనా వదిలేయాలని కోరుతూ కరపత్రాలు దర్శనమిచ్చాయి. వీటికి 'మేక్ ఎడిసన్ గ్రేట్ అగైన్' అనే శీర్షిక పెట్టారు.
ఏసియన్-అమెరికన్ స్కూల్ బోర్డు సభ్యులుగా ఉన్న ఇండో అమెరికన్ ఫాల్గుణి పటేల్, చైనీస్ అమెరికన్ జెర్రీ షీలను టార్గెట్ చేస్తూ, వారిని బహిష్కరించాలని ఈ కరపత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు వాషింగ్టన్ కి చెందిన కెంట్రిడ్జ్ హైస్కూలులో తలపాగా ధరించిన 14 ఏళ్ల సిక్కు విద్యార్థిపై తోటి విద్యార్థి దాడి చేసి, అతనిపై పిడిగుద్దులు గుప్పించాడు. తాజా ర్యాలీ నేపథ్యంలో భారతీయులు, చైనీయులు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత శ్వేతజాతీయుల్లో జాత్యహంకారం పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.