jagan: ఫిరాయింపునకు ఆరుగురు రెడీ... ఆరో తేదీన జగన్ కు పెను షాక్!
- జగన్ కు ఆ పార్టీ నేతలే బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్యలు
- మరో ఐదారుగురు ఫిరాయింపునకు రెడీ
- పాదయాత్రకు తొలి అడుగు పడే సమయంలోనే చేరిక
- జగన్ దుర్మార్గ వైఖరితో నేతలు విసిగిపోయారన్న కళా వెంకట్రావు
నవ్యాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, ప్రతి ప్రాజెక్టుపైనా కోర్టును ఆశ్రయిస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పే ముందు ఆ పార్టీ నాయకులే బుద్ధి చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరడంతో మొత్తం 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని ఆశ్రయించినట్టు కాగా, మరో ఐదారుగురు కూడా రానున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే, ఎవరెవరు జంప్ చేస్తారన్న విషయమై స్పష్టమైన పేర్లు వెల్లడి కాకున్నా, కర్నూలు జిల్లా నుంచి ఒకరు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని సమాచారం. వీరంతా 6వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించిన క్షణాన తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు జరిగిపోయాయని, వచ్చే ఎన్నికల్లో వీరికి సిటింగ్ స్థానాన్ని టీడీపీ ఆఫర్ చేసిందని సమాచారం.
ఇక ఇదే విషయాన్ని పలువురు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ ఉదయం చంద్రబాబు నివాసం వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ, జగన్ వైఖరితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని, అందువల్లే తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపి, వాటి పరిష్కారానికి నిర్మాణాత్మక సలహాలను ఇవ్వాల్సిన స్థితిలో ఉన్న విపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని ప్రజలే అసహ్యించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.