interpreter: ప్రధాని మోదీకి, ఇతర దేశాల నాయకులకు మధ్య భాషావారధి ఈమెనే!
- భాషానువాదంలో 27 ఏళ్ల అనుభవం
- మోదీ ప్రసంగాలను ప్రత్యక్ష అనువాదం చేసే గుర్దీప్ చావ్లా
- ప్రతి అంతర్జాతీయ సమావేశంలోనూ భాగస్వామ్యం
విదేశాల్లో నిర్వహించే సమావేశాల్లో, ఐక్యరాజ్య సమితి నిర్వహించే సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ దాదాపు హిందీలోనే మాట్లాడుతారు. మరి అలాంటప్పుడు హిందీ రాని విదేశీయులకు ప్రధాని భావజాలం ఎలా అర్థమవుతుందనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. మైకుల్లో అనువదించే వాళ్లు ఉంటారని కొంతమందికి తెలుసు. మరి కొంతమందికి ఆ అనువదించే వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మరి మోదీ మాటలను విదేశీ నాయకులకు అనువదించేది ఎవరో తెలుసా?
ఆమె పేరు గుర్దీప్ చావ్లా.. ప్రపంచాన్ని ఉత్తేజ పరిచేలా మాట్లాడే మోదీ వాక్చాతుర్యం ఉన్నది ఉన్నట్లుగా, భావంలో తీవ్రత తగ్గకుండా ఆమె ఆంగ్లంలోకి అనువదిస్తుంది. అలాగే కొన్నిసార్లు విదేశీ నాయకుల మాటలను ఆంగ్లం నుంచి హిందీలోకి ఆమె అనువదిస్తుంది. భాషానువాదంలో ఆమెకు 27 ఏళ్ల అనుభవం ఉంది. చాలా పెద్ద పెద్ద అంతర్జాతీయ సమావేశాల్లో ఆమె మోదీకి లైవ్ ఇంటర్‌ప్రిటేషన్ చేసింది. అంటే మోదీ మాట్లాడగానే, ఆయన మాటల్ని ఆంగ్లంలోకి అక్కడే అనువదించడం. వాషింగ్టన్ పర్యటనలో ఉన్నపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మోదీలకు మధ్య ఆమె భాషావారధిగా పనిచేసింది.
ప్రస్తుతం అమెరికా పౌరసత్వం పొందిన గుర్దీప్ చావ్లా... 1990లో ఆమె 21వ ఏట భాషానువాదిగా భారతీయ పార్లమెంట్‌లో చేరింది. పెళ్లైన తర్వాత 1996లో అమెరికాకు వెళ్లిపోయింది. పార్లమెంట్‌లో పనిచేసిన ఆరేళ్లలో ఎంతో నేర్చుకున్నట్లు గుర్దీప్ చావ్లా చెప్పింది. 2010లో ఒబామా మొదటిసారి భారత్ కు వచ్చినపుడు ఆయనకు అనువాదిగా పనిచేసింది.
అలాగే 2015 గణతంత్ర దినోత్సవం సమయంలోనూ ఒబామా ప్రసంగాన్ని గుర్దీప్ లైవ్‌లో అనువదించింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, భారత్ దేశాల మధ్య జరిగే అన్ని ఉన్నత స్థాయి సమావేశాల్లోనూ ఆమె ఉంటుంది. మోదీతో పాటు ఒబామా, ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ త్రెదోలకు ఆమె ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసింది.