yadyurappa: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు చేదు అనుభవం!
- నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో పాల్గొన్న యడ్యూరప్ప
- రాళ్లు రువ్విన అసమ్మతి కార్యకర్తలు
- తృటితో తప్పించుకున్న యడ్యూరప్ప
- దాడికి యత్నించిన బీజేపీ బహిష్కృత నేత చౌదరి నాగేశ్ మద్దతుదారులు
బీజేపీ కర్ణాటక కీలక నేత, మాజీ సీఎం యడ్యూరప్పకు చేదు అనుభవం ఎదురైంది. తమ రాష్ట్రంలో చేపడుతోన్న నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో ఆయన పాల్గొంటుండగా రాళ్లదాడి జరిగింది. బీజేపీ అసమ్మతి కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్లవర్షం కురిపించడంతో అలజడి చెలరేగింది. బీజేపీ నుంచి ఇటీవల చౌదరి నాగేశ్ అనే నేత బహిష్కరణకు గురయ్యాడు. ఆయన మద్దతుదారులే యడ్యూరప్ప వాహనంపై రాళ్లు రువ్వారని తెలిసింది.
అయితే, ఈ దాడి నుంచి యడ్యూరప్ప తృటిలో బయటపడ్డారు. ఆ రాష్ట్రంలో ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకపై దృష్టి పెట్టింది.