Chandrababu: సైకిల్ తొక్కి అలరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!
- గుంటూరు జిల్లా పేరేచర్లలో నగర వనం కార్యక్రమం
- 510 ఎకరాల్లో నిర్మించనున్న నగర వనం
- ఇందులో ఓపెన్ ఆర్ట్ థియేటర్, యోగా కేంద్రం, సైక్లింగ్ ట్రాక్, రెస్టారెంట్
- అంతేగాక పిల్లల కోసం అడ్వెంచర్ పార్కు, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు
గుంటూరు జిల్లా పేరేచర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర వనం కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా చెట్లు నాటిన అనంతరం కార్తీక వనమహోత్సవం కార్యక్రమం జరిగింది. 510 ఎకరాల్లో నగర వనం నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇందులో ఓపెన్ ఆర్ట్ థియేటర్, యోగా కేంద్రం, సైక్లింగ్ ట్రాక్, రెస్టారెంట్, పిల్లల కోసం అడ్వెంచర్ పార్కు, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. ఇందుకోసం తొలి విడతగా ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఇది సందర్శకులను బాగా ఆకర్షిస్తుందని చెప్పారు. వారాంతంలోనే కాకుండా నిత్యం ప్రజలు సందర్శించేలా చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు సరదాగా సైకిల్ తొక్కారు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.