Bihar: నేను గడ్డి తిన్నాను సరే.. మరి నితీశ్ ఏం తిన్నారో..!: లాలు వ్యంగ్యాస్త్రాలు
- తన హయంలోని దాణా కుంభకోణాన్ని గుర్తు చేసుకున్న లాలు
- నితీశ్ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోవడం ఖాయమని జోస్యం
- వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న వైనం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన టాయిలెట్ల కుంభకోణాన్ని తన హయాంలో జరిగిన దాణా కుంభకోణంతో పోల్చారు. అప్పట్లో తనను గడ్డి తిన్నారని అందరూ ఆడిపోసుకున్నారని, మరి ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని ప్రశ్నించారు.
రాజధాని పట్నాలో టాయిలెట్ల నిర్మాణం పేరుతో రూ.13.50 కోట్ల నిధులను దోచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ప్రస్తావిస్తూ... తాను అప్పట్లో గడ్డి తిన్నానని అన్నవాళ్లు ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని చెబుతారంటూ ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుంభకోణాల్లో ఇరుక్కుంటుందని జోస్యం చెప్పారు. లాలు వ్యాఖ్యలపై నితీశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.
గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన నితీశ్ ఇటీవల ఆర్జేడీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో నితీశ్, లాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి.