donald trump: భయాందోళనలను రేకెత్తిస్తున్న ట్రంప్ ఆసియా పర్యటన!
- అమెరికా కలలు కనడం మానుకోవాలన్న ఉత్తర కొరియా
- ఆయుధాలకు మరింత పదును పెడతామంటూ హెచ్చరిక
- అణ్వాయుధ ముప్పు పెరుగుతుందని భయపడుతున్న దక్షిణ కొరియా వాసులు
అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి తాము అణ్వాయుధాలను నిర్వీర్యం చేసుకుంటామనే భ్రమల్లో అమెరికా ఉందని ఉత్తర కొరియా ఎద్దేవా చేసింది. పగటి కలలను కనడం అమెరికా మానుకోవాలని హితవు పలికింది. తమ పట్ల వైరి భావాన్ని అమెరికా వదులుకోవాలని... లేకపోతే తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలకు మరింత పదును పెడతామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ అధీనంలో ఉండే కేసీఎన్ఏ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసియా యాత్ర కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. మంగళవారంనాడు ట్రంప్ దక్షిణ కొరియాకు చేరుకుంటారు. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తమకు ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధ, క్షిపణి ముప్పు మరింత పెరుగుతుందని పలువురు దక్షిణ కొరియావాసులు భయపడుతున్నారు.