kancha ilaiah: కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన కంచ ఐలయ్య!
- సచివాలయానికి వాస్తు బాగోలేకపోతే తెలంగాణ ఎలా వచ్చింది?
- పత్తి రైతుల సమస్యలను పరిష్కరించండి
- కేసీఆర్ తన మనవడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు?
టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయానికి వాస్తు బాగోలేదని అంటున్నారని... వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కొత్త సచివాలయం నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచనే తప్పని... అనవసరంగా దానిపై ఖర్చు పెట్టే బదులు, ఆ నిధులను పత్తి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వినియోగిస్తే బాగుంటుందని అన్నారు.
సికింద్రాబాద్ లో జరిగిన టీమాస్ సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే వరంగల్ లోని పత్తి మార్కెట్ ను సందర్శించి, అక్కడి వ్యాపారుల ఆగడాలను బయటపెడతామని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి పత్తి రైతు ఇంట్లో టీమాస్ నిద్ర చేస్తుందని చెప్పారు. పత్తి రైతులు కూడా హిందువులేనని... తనను విమర్శించే పీఠాధిపతి వారి సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... తన మనవడిని మాత్రం తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కూడా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేరని... వారికంటే కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ ను అనర్గళంగా మాట్లాడాలని అన్నారు. తన ఇంటి ఎదుట పోస్టర్లు అంటించిన ఘటనపై స్పందిస్తూ.... ఆర్యవైశ్యులతో పాటు, ఓ పార్టీకి చెందిన వ్యక్తులే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపించారు. తనను క్షమించడం కంటే ముందు పత్తి రైతులను కాపాడాలని ఎద్దేవా చేశారు.