haryana: వయసు 13 ఏళ్లు.. 8 విదేశీ భాషలు మాట్లాడగలదు!
- ఐఏఎస్‌లకే పాఠాలు చెబుతోంది
- వండర్ గర్ల్‌గా ప్రాచుర్యం సంపాదించిన జాహ్నవి
- ఐఏఎస్ అవ్వాలనుకుంటున్న హర్యానా బాలిక
`వండర్ గర్ల్ జాహ్నవి`... హర్యానా నుంచి ఢిల్లీ వరకు ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్ల వయసులో 8 విదేశీ భాషలు అనర్గళంగా మాట్లాడుతూ... ఐఏఎస్‌లకే శిక్షణ పాఠాలు నేర్పించే జాహ్నవి ఉత్తర భారతంలో చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది. అంతేకాదు... సోషల్ మీడియా ద్వారా ఇంగ్లిషు పాఠాలు కూడా నేర్పించే ఆమెను చూస్తే నిజంగానే వండర్ గర్ల్ అనిపిస్తుంది.
హర్యానాలోని సమాల్ఖా జిల్లాలోని మల్పూర్ గ్రామానికి చెందిన జాహ్నవి పన్వార్‌కి చిన్నప్పటి నుంచి భాషలు నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. ఇంగ్లిషులో అమెరికన్, బ్రిటన్ పలికే విధానాలను కూడా జాహ్నవి అవపోసన పట్టేసింది. ఎక్కువగా ఇంగ్లిషు వార్తా ఛానళ్లు చూసి పలికే విధానం నేర్చుకుంది. వయసు పదమూడే అయినా ఇప్పటికే 12వ తరగతి పరీక్షలు కూడా రాసి ఉత్తీర్ణురాలైంది. ఒకే ఏడాదిలో రెండు తరగతుల పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైన విద్యార్థినిగా జాహ్నవి పేరిట రికార్డు ఉంది.
`జాహ్నవి ఇంగ్లిషు` పేరిట ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో ఇంగ్లిషు పాఠాలు కూడా నేర్పిస్తోంది. జపనీస్, ఫ్రెంచ్ భాషలను కూడా అనర్గళంగా మాట్లాడే జాహ్నవి, ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లను ఉద్దేశించి ప్రసంగాలు కూడా చేసింది. ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది తన లక్ష్యం అంటున్న జాహ్నవి కల త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం.