soudi arebia: సౌదీ యువరాజు ఇల్లా మజాకా?... 888 కోట్లు...317 గదులు...250 బంగారు టీవీలు..వీడియో చూడండి!
- అత్యంత ధనవంతుడైన సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్
- ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో 41వ అత్యంత ధనవంతుడిగా కీర్తి
- రియాద్ లో ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదం
సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్ కేవలం సౌదీలోనే కాదు, ప్రపంచంలోనే అందరికీ సుపరిచితుడైన వ్యాపారవేత్త. అంతటి వ్యక్తి సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక కమిటీ నివేదికతో ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. మొత్తం 11 మంది యువరాజులను అరెస్టు చేయగా, వారందర్లోకీ వాలీద్ బిన్ తలాల్ సంపన్నుడు కావడం విశేషం. ఆయన ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 41వ ర్యాంక్ సాధించారు.
ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. దీంతో ఆయన ఆస్తి 19.2 బిలియన్ డాలర్ల (దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగానే) ని ఫోర్బ్స్ తెలిపింది. కాగా, ఆయనకు అత్యంత విలాసవంతమైన భవనం సౌదీ రాజధాని రియాద్ లో ఉంది. దీని విలువ 130 మిలియన్ డాలర్లు (సుమారు 888 కోట్ల రూపాయలకు పైగా) ఉంటుందని అంచనా. ఇందులో వాలీద్ బిన్ తలాల్ తన ఇద్దరు భార్యలు, పిల్లలతో నివాసం ఉంటారు.
ఈ రాజప్రాసాదంలో 317 గదులుండగా, అందులోని 250 గదుల్లో బంగారు పూత ఉండే 250 టీవీలు ఏర్పాటు చేశారు. అలాగే 45 సీట్లు ఉండే సినిమా థియేటర్ కూడా అందులో ఉంది. 2,500 మందికి ఒకేసారి వండిపెట్టగల వంటమనుషులు, ఏర్పాట్లు ఉన్నాయి. ఎన్నో లగ్జరీ కార్లు, ఇతర సౌకర్యాలు ఉన్న ఆ రాజభవనం...ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. మీరు కూడా ఆ ఇంటిని చూడండి.