YSRCP: మన మేనిఫెస్టో రెండు పేజీలు మాత్రమే ఉంటుంది.. అన్నీ చేశామని 2024లో గర్వంగా చెప్పుకుంటాం: జగన్
- ప్రజలతో మమేకమై మేనిఫెస్టో తయారు చేస్తాం
- నవరత్నాలను మెరుగుపరిచేందుకు సలహాలు ఇవ్వండి
- చెప్పినవి, చెప్పనివి అన్నీ చేస్తాం
13 జిల్లాలో 3వేల కిలోమీటర్లకు పైగా కొనసాగనున్న పాదయాత్రలో ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులతో మమేకమవుతామని... వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వారి బాధలను తొలగించేందుకు కృషి చేస్తామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇప్పటికే నవరత్నాలను ప్రకటించామని... ఆ నవరత్నాలను మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచలను ఇవ్వాలంటూ జగన్ పిలుపునిచ్చారు. మేనిఫెస్టో అనేది ఆఫీసుల్లో కూర్చొని తయారు చేసేది కాదని... ప్రజల మధ్యలో దాన్ని తయారు చేయాలని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఇంటర్నెట్ లో వెతికినా కనిపించదని... ఎందుకంటే అందులో ఉన్న హామీలను చూసిన వారు, తమ కాలర్ పట్టుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఉందని ఎద్దేవా చేశారు.
తమ నాయకుడు పలానా వ్యక్తి అని కార్యకర్తలు సగౌరవంగా చెప్పుకునే విధంగా నాయకులు ఉండాలని జగన్ అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే ఏ కార్యకర్త అయినా 'ఈయన మా నాయకుడు కాదు, ఈయన మోసగాడు' అనే చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా బుక్కులు బుక్కుల మేనిఫెస్టో పెట్టబోమని... కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను మాత్రమే తీసుకొస్తామని అన్నారు.
ఇది ప్రజలు ఇచ్చిన మేనిఫెస్టో, దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని గర్వంగా చెబుతామని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేసి చూపిస్తామని అన్నారు. 2024 ఎన్నికల సమయంలో చెప్పినవి, చెప్పనివి అన్నీ చేశామని గర్వంగా చెప్పుకుంటామని అన్నారు.