jagan: ఇలాంటి ముఖ్యమంత్రిని దొంగ అంటారా? మోసగాడు అంటారా?: జగన్
- రైతులకు రుణాలు ఇవ్వద్దని బ్యాంకులకు చంద్రబాబు చెబుతున్నారు
- రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు
- ప్రత్యేక హోదాను కూడా పక్కనబెట్టారు
చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆస్తులు ఏమైనా పెరిగాయా? అని తాను ప్రశ్నిస్తున్నానని... అయితే, ఇదే సమయంలో అప్పులు మాత్రం రూ. 2,06,000 కోట్లకు చేరుకున్నాయని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే చంద్రబాబు చేసిన అప్పు ఇది అని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మన అప్పు కేవలం రూ. 96వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. వ్యవసాయరంగాన్ని దెబ్బతీశారని... రైతులకు రుణాలు కూడా ఇవ్వద్దని బ్యాంకులకు చెబుతున్నారని విమర్శించారు. ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గిపోతోందని అన్నారు. రైతులు పండిస్తున్న ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, రుణమాఫీ చేయకుండా మోసం చేశారని అన్నారు.
ఎన్నికలకు ముందు రూ. 5 వేల కోట్లతో పంట మద్దతు ధరకు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని... ఎన్నికల తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా 30శాతం కమిషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న విషయాన్ని పక్కనబెట్టి, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పక్కనబెట్టారని ధ్వజమెత్తారు. ఇలాంటి ముఖ్యమంత్రిని దొంగ అంటారా? లేదా మోసగాడు అంటారా? అని ప్రశ్నించారు. ఇడుపులపాయ సభలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ మేరకు విమర్శలు గుప్పించారు.