padmavathi: వేరే మతాల గురించి సినిమా తీసే దమ్ము భన్సాలీకి ఉందా?: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- 'పద్మావతి' చిత్ర వివాదంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి
- ఇక దీనిపై సహించేది లేదు
- చరిత్రను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు
దమ్ముంటే ఇతర మతాల గురించి కూడా సినిమాలు తీసి చూపించమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సవాలు విసిరారు. 'భన్సాలీకి గానీ లేదా మరే ఇతర దర్శకుడికి గానీ ఇతర మతాల మీద సినిమాలు తీసే దమ్ముందా? వాళ్లు కేవలం హిందూ దేవుళ్లు, మత గురువులు, వీరుల మీదే సినిమాలు తీయగలరు. ఇక నుంచి ఇలాంటి సినిమాలను సహించేది లేదు' అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
'పద్మావతి' చిత్రంలో రాణి పద్మావతి, మహారావల్ రతన్ సింగ్, అల్లా ఉద్దీన్ ఖిల్జీల పాత్రలను తప్పుగా చూపించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లు నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే కొన్ని హిందూ వర్గాలు వ్యతిరేకత తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రను తప్పుగా చూపించి నాశనం చేస్తున్నారంటూ శ్రీ రాజ్పుత్ కర్ని సేన ఆరోపిస్తూ, సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిరసనలు కూడా చేస్తోంది.