ys jagan: జగన్ నోట 'మద్య నిషేధం' మాట!
- ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాల్లేవు
- జన్మభూమి కమిటీ దొంగలకే అధికారాలు
- అవినీతిపరులందర్నీ జైల్లో పెట్టించాలనే కసి ఉంది
నంద్యాల ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ గెలుపొందిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే, ప్రజల్లో అభిమానం ఉందని ఆయన భావిస్తుంటే... 20 చోట్ల ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు దొంగలముఠాలుగా తయారయ్యాయని మండిపడ్డారు. వీటిని చూస్తుంటే బాలగంగాధర్ తిలక్ చెప్పిన 'గాంధీ దేశంలో గజానికొక గాంధారి కొడుకు' అనే మాటలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజాప్రతినిధులకు అధికారం లేదని... జన్మభూమి కమిటీ దొంగలకే చంద్రబాబు అధికారాలను కట్టబెట్టారని విమర్శించారు.
తనకు కాసులంటే కక్కుర్తి లేదని... చంద్రబాబులా కేసులకు భయపడని జగన్ అన్నారు. తనకు ఒక కసి ఉందని... చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలనేదే ఆ కసి అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవాలనే కసి, ప్రతి యువతకు ఉద్యోగం ఇప్పించాలనే కసి తనలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ను 'అభివృద్ధి ఆంధ్రప్రదేశ్'గా మార్చాలనే కసి తనకుందని చెప్పారు.
మద్య నిషేధాన్ని విధించాలనే కసి తనలో ఉందని అన్నారు. అవినీతిపరులందరినీ జైల్లో పెట్టించాలనేది తన కసి అని చెప్పారు. చంద్రబాబు అరాచక పాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టానని... అందరి ఆశీస్సులు తనకు కావాలని ప్రజలను కోరారు. ఇడుపులపాయ సభలో ఆయన మాట్లాడుతూ పై విధంగా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.