dmk: చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన ప్రధాని మోదీ!
- మోదీని సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్
- 20 నిమిషాలు ముచ్చటించిన కరుణానిధి, మోదీ
- మోదీతో పాటు గవర్నర్, రక్షణ మంత్రి
చెన్నైలోని గోపాలపురంలో ఉన్న నివాసంలో డీఎంకే అధినేత కరుణానిధిని ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు కలిశారు. చక్రాల కుర్చీలో ఉన్న కరుణానిధికి దగ్గరగా కూర్చుని, ఆయన చేతుల్లో చేయి వేసి ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలపాటు ముచ్చటించారు. ఇంట్లోకి వస్తున్నపుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్, మోదీకి ఎర్ర రంగు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించాడు. మోదీతో పాటు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, షిప్పింగ్ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందరాజన్లు కూడా ఉన్నారు.
కొంతమంది డీఎంకే నాయకులతో పాటు కరుణానిధి కుమార్తె కణిమొళి కూడా అక్కడ ఉన్నారు. సమావేశం తర్వాత కరుణానిధి వీల్‌చైర్ సహాయంతో బయటికి వచ్చి, కార్యకర్తలకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. డ్రగ్ అలర్జీ కారణంగా అక్టోబర్ 2016 నుంచి కరుణానిధి వీల్‌చైర్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.