social cause: సంఘసేవ కోసం సాంకేతికత ఉపయోగించిన హీరో విశాల్... 'వి షల్' పేరుతో సేవా యాప్
- యాప్ ద్వారా సేవ చేసే అవకాశం
- కొత్తగా ప్రయత్నించిన తమిళ హీరో
- అన్ని యాప్ స్టోర్లలోనూ లభ్యం
ఈరోజుల్లో సాంకేతికత కారణంగా ప్రతి పని చాలా సులువుగా జరిగిపోతోంది. ప్రతి చిన్న పనికి యాప్ అంటూ రోజుకో యాప్ పుట్టుకొస్తూనే ఉంది. మరి సంఘసేవకు కూడా ఒక యాప్ ఉంటే బాగుండుననుకుని తమిళ హీరో విశాల్ ఓ యాప్ తయారు చేయించారు. 'వి షల్' అనే పేరున్న ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్న వారికి సాయం చేసే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.
ఈ యాప్ ఆవిష్కరణలో భాగంగా విశాల్ ఒక వీడియో విడుదల చేశాడు. 'నిత్యజీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. కిరాణ సరుకుల నుంచి ఫర్నీచర్ వరకు అన్నీ ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకి వచ్చేస్తున్నాయి. అదే విధానాన్ని సామాజిక సమస్యల కోసం ఉపయోగిస్తే లక్షల మందికి మేలు జరుగుతుంది' అని వీడియోలో అన్నాడు.
అలా సేవ చేయాలనుకున్న వారి కోసం 'వి షల్' యాప్‌ను రూపొందించినట్లు విశాల్ వెల్లడించాడు. 'సహాయం చేయాలనుకునే వారికి వి షల్ బృందం వెన్నుదన్నుగా ఉంటుంది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయిన తర్వాత దాతలు ఇచ్చిన వాటిని నిజంగా అవసరంలో ఉన్న వారికి అందజేస్తుంది. అందజేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్‌తో పాటు కృతజ్ఞతల సర్టిఫికెట్ కూడా పంపిస్తారు' అని విశాల్ తెలిపాడు. ఈ యాప్ అన్ని యాప్ స్టోర్లలో అందుబాటులో ఉందని, దాన్ని డౌన్లోడ్ చేసుకుని వీలైనంత సహాయం చేయాలని విశాల్ కోరాడు.