Jammu and Kashmir: స్వతంత్ర కశ్మీర్ కు మద్దతిచ్చేది లేదు: లండన్ లో పాక్ ప్రధాని
- కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని
- లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ పాకిస్థాన్ 2017
- కశ్మీర్ సమస్య పరిష్కారమైతేనే భారత్ తో సంబంధాలు మెరుగుపడతాయి
కశ్మీర్ పై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర కశ్మీర్‌కు మద్దతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ స్పష్టం చేశారు. లండన్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ పాకిస్థాన్ 2017’ అంశంపై ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ ల మధ్య కశ్మీర్ ప్రధాన సమస్య అన్నారు. ఆ సమస్య పరిష్కారమైతేనే భారత్ తో సంబంధాలు మెరుగుపడతాయని ఆయన స్పష్టం చేశారు.
కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏ స్థాయిలో అయినా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సమస్యకు యుద్ధం ఒక ఛాయిస్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాలు ఎన్నికలకు వెళుతున్న వేళ ద్వైపాక్షిక చర్చలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
2018లో పాకిస్థాన్ ఎన్నికలు జరగనుండగా, 2019లో భారత్ లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పిన షాహిద్ అబ్బాసీ ఈ సందర్భంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరాడుతోందని ఆయన తెలిపారు. ఈ సదస్సులో విద్యార్థుల ప్రశ్నలకు పాక్ ప్రధాని సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ఆయనను 'స్వతంత్ర కశ్మీర్ కు మద్దతు ఇస్తారా?' అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, అందుకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.