Sonia gandhi: సోనియాగాంధీ మెడకు తెహల్కా ఉచ్చు?
- తేజ్పాల్కు లబ్ధి చేకూర్చేలా సోనియా లేఖ
- దర్యాప్తును నీరుగార్చిన చిదంబరం
- ‘టౌమ్స్ నౌ’ కథనంతో ప్రకంపనలు
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ మెడకు ‘తెహల్కా’ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘టైమ్స్ నౌ’ కథనం సంచలనం సృష్టిస్తోంది. తెహల్కా చీఫ్ తరుణ్ తేజ్పాల్తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ ప్రైవేటు సంస్థపై చేపట్టిన దర్యాప్తును సోనియా నీరు గార్చేందుకు ప్రయత్నించారన్నది ఆ కథనంలోని ప్రధాన అంశం. దర్యాప్తును నీరుగార్చే ఉద్దేశంతో సెప్టెంబరు 20, 2004లో సోనియాగాంధీ అప్పటి ఆర్థికమంత్రి పి.చిదంబరానికి లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది.
పరస్పర ప్రయోజనాలు ఈ లేఖలో కనిపిస్తున్నాయని, ‘ఇచ్చిపుచ్చుకునే’ వ్యవహారంలో భాగంగానే సోనియా ఆ లేఖ రాశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోనియా లేఖ రాసిన నాలుగు రోజుల తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం మంత్రుల గ్రూప్(జీఓఎం)ను ఏర్పాటు చేసినట్టు ‘టైమ్స్ నౌ’ తెలిపింది. లేఖ అందిన ఆరు రోజుల తర్వాత తెహల్కాలో ఇన్వెస్టర్ అయిన ‘ఫస్ట్ గ్లోబల్’ సంస్థపై ప్రభుత్వం దర్యాప్తును ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది. సోనియా లేఖతో ప్రధానంగా నాలుగు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కథనంలో పేర్కొంది.
కాంగ్రెస్ చీఫ్ అయిన సోనియా గాంధీ ఓ ప్రైవేటు సంస్థ గురించి ఎందుకు లేఖ రాశారు? అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన తేజ్పాల్ రుణం సోనియా ఆ రకంగా తీర్చుకున్నారా? ప్రభుత్వంలోని కీలక సమాచారాన్ని సోనియాతో మంత్రులు పంచుకునే వారా? సోనియా లేఖ కారణంగానే ఆ ప్రైవేటు సంస్థపై దర్యాప్తును చిదంబరం పక్కన పెట్టేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని ‘టైమ్స్ నౌ‘ పేర్కొంది.