chandrababu: మొదలు పెట్టిన రోజే ఈ తిట్లేంటి? జగన్ మారడా?: చంద్రబాబు
- వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడటం ఎంత వరకూ కరెక్ట్?
- పాదయాత్ర ఉద్దేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న జగన్
- అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వినియోగించుకోండి
- టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటూ, యాత్రను ఆరంభించిన తొలిరోజునే జగన్ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంత వరకూ సరైనదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన, పాదయాత్ర తొలిరోజున జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, నడక మొదలు పెట్టిన తొలి రోజే తిట్లేంటని విమర్శించారు. జగన్ మైండ్ సెట్ ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు.
ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేసే నాయకుల వద్దకు వస్తారని, కానీ జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే సమావేశంలో 10వ తేదీ నుంచి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చంద్రబాబు సమాలోచనలు జరిపారు.
ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండదు కాబట్టి, ప్రశ్నోత్తరాల సమయాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కరానికి కృషి చేయాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా లోపాలుంటే తెలియజేయాలని అన్నారు.