s srishant: కష్టకాలంలో ద్రావిడ్, ధోనీ నన్ను ఆదుకోలేదు!: శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
- రాహుల్ ద్రావిడ్, ధోనీలు స్పందించలేదు
- ధోనీకి మెసేజ్ పెట్టినా సమాధానం రాలేదు
- టాప్-10లో ఆరుగురు నిందితులు
- వారి పేర్లు బయటకు వచ్చుంటే తెలిసేది
- కేరళ క్రికెటర్ శ్రీశాంత్
క్రికెట్ నుంచి జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీలపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఎంతమాత్రమూ మద్దతివ్వలేదని ఆరోపించాడు. "రాజస్థాన్ రాయల్స్ తరపున ఉన్న రాహుల్ ద్రావిడ్ నాకు మద్దతుగా నిలవలేదు. నా గురించి అతనికి బాగా తెలుసు కూడా. నేను ఎంతో భావోద్వేగంతో నా బాధను ధోనీకి మెసేజ్ చేస్తే, ఆయన కూడా స్పందించలేదు" అని 'రిపబ్లిక్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ పోలీసులు టాప్-10 భారత ఆటగాళ్లలో ఆరుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. నా పేరు ఒక్కటే బయటకు వచ్చింది. మిగతావారు కూడా బయటకు వచ్చుంటే, క్రికెట్ ఆటపై నిజమైన ప్రభావం పడేదని అన్నాడు. బీసీసీఐ ఓ ప్రైవేటు కంపెనీ అని, ఆ కంపెనీ ప్రకటించే టీమ్ జాతీయ టీమ్ కాదని, తనకు అవకాశం లభిస్తే, మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడుతానని అన్నాడు. కాగా, 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న శ్రీశాంత్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాలూ ఇదే కేసులో దోషులుగా తేలారు.