manmohan singh: ఇకనైనా తప్పు ఒప్పుకోండి: నరేంద్ర మోదీకి మన్మోహన్ సింగ్ సలహా
- నేడు గుజరాత్ లో పర్యటించనున్న మన్మోహన్
- జీఎస్టీ, నోట్ల రద్దు మోదీ చేసిన అతిపెద్ద తప్పులు
- తిరిగి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేయాలి
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో నేడు కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని ఎండగట్టారు. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వంటి సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ ను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ఆ రెండూ మోదీ చేసిన అతిపెద్ద తప్పులని, ఇప్పటికైనా, మోదీ తన తప్పును అంగీకరించాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.
మోదీ నిర్ణయాలు భారత వ్యవస్థకు విపత్తులను తెచ్చి పెట్టాయని, ఇండియా వంటి దేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయం మోదీ అమలులోకి తెచ్చిన నోట్లరద్దు, జీఎస్టీతో బహిర్గతమైందని అన్నారు. తాను చేసిన అతిపెద్ద తప్పును మోదీ అంగీకరించి, భారత వ్యవస్థను తిరిగి నిలిపేందుకు కృషి చేయాలని, లేకుంటే, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. గుజరాత్ లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన అన్నారు.
కాగా, మన్మోహన్ సింగ్, నేటి తన పర్యటనలో భాగంగా గుజరాత్ వ్యాపారులను ప్రత్యేకంగా కలుసుకుని, వారి వ్యాపారాలపై జీఎస్టీ చూపిన ప్రభావాన్ని గురించి అడిగి తెలుసుకోనున్నారు.