KTR: కేటీఆర్ కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి... విషయం చెప్పి క్లాస్ పీకిన కేటీఆర్!
- ప్రశ్నను వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పిన కిషన్ రెడ్డి
- ఆపై అసెంబ్లీకి వచ్చి ఉద్యోగాల కల్పనపై చర్చకు రభస
- ఇదేం వైఖరంటూ నిప్పులు చెరిగిన కేటీఆర్
నేడు అసెంబ్లీలో తాను అడగాల్సిన ప్రశ్నను వాయిదా వేసుకుంటున్నానని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, స్వయంగా ఫోన్ చేసి కేటీఆర్ కు చెప్పగా, ఏవో కారణాలతో ఆయన అసెంబ్లీకి రావడం లేదని తొలుత భావించిన కేటీఆర్, ఆపై అసలు విషయం తెలుసుకుని, ఆయన వైఖరిని విమర్శిస్తూ క్లాస్ పీకారు. నేడు ప్రశ్నోత్తరాల సమయంలో తొలి ప్రశ్న గ్రేటర్ హైదరాబాద్ లో మంచి నీటి కొరతపై కిషన్ రెడ్డి సంధించినది.
తొలి ప్రశ్న తనదే అయిన వేళ, ప్రశ్నను వాయిదా వేసుకుంటున్నట్టు తనకు చెప్పి, ఆపై అసెంబ్లీకి వచ్చి గోల చేయడం ఏంటని కిషన్ రెడ్డి వైఖరిని కేటీఆర్, అసెంబ్లీలోనే దుయ్యబట్టారు. ప్రధానమైన ఓ సమస్యపై ప్రశ్న వేసి, దానిపై చర్చించాల్సిన సమయానికి వెనక్కు వెళ్లడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఇక హైదరాబాద్ లో నీటి సమస్య లేదని, అందువల్లే ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలో తెలియక, ప్రశ్నను రద్దు చేసుకుని, గొడవకు దిగారని అన్నారు. కాగా, ఈ ఉదయం ఉద్యోగాల కల్పనపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టగా, తాము చర్చకు సిద్ధమని, సహ కార్యక్రమాలకు ఆటంకం కలిగించకుండా మరో ఫార్మాట్ లో చర్చకు అనుమతి కోరాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.