delhi: రాజధానిని కమ్మేస్తున్న వాయు కాలుష్యం... ఢిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్!
- ప్రజలు బయటికి రావొద్దని కోరిన ఐఎంఏ అధ్యక్షుడు
- పాఠశాలలు కూడా మూసివేయాలని వినతి
- ఢిల్లీ హాఫ్ మారథాన్ రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి
దేశరాజధానిలో కాలుష్యం కోరలు గమనించి, వాయు నాణ్యత తగ్గిపోతోందని గ్రహించిన ఇండియన్ మెడికల్ అసోసియేన్ (ఐఎంఏ) ఢిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వీలైనంతవరకు ప్రజలు బయటికి రావడాన్ని తగ్గించుకోవాలని, పాఠశాలలు కూడా మూసివేయాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కోరారు. అలాగే నవంబర్ 19న జరగనున్న ఢిల్లీ హాఫ్ మారథాన్‌ను కూడా రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కోరారు.
ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యత ఒక్కసారిగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గాల్లో కాలుష్య కారకాల పరిమాణం పర్టిక్యులెట్ మ్యాటర్ 2.5, 10ల విలువ 452, 336ల స్థాయికి వెళ్లింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీని విలువ 25 ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్న భారతీ ఎయిర్టెల్, ప్రభుత్వం ఆదేశిస్తే మారథాన్ ఆపేందుకు సిద్ధమని పేర్కొంది. మరి, దీనిపై ఢిల్లీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!