indigo airlines: ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది దాష్టీకం... ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం!..వీడియో చూడండి
- ఇండిగో విమానంలో న్యూఢిల్లీ వెళ్లిన రాజీవ్ కటియాల్
- గ్రౌండ్ సిబ్బందితో మాటామాటా
- కటియాల్ ను కిందపడేసి దాడి చేసిన ఇండిగో సిబ్బంది
ఇటీవల భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును అవమానించిన ఘటనతో ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ అప్రదిష్ఠను మూటగట్టుకోగా, తాజాగా వెలుగు చూసిన ఒక వీడియో ఆ సంస్థ పరువు మరింతగా తీసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... రాజీవ్ కటియాల్ (53) అనే వ్యక్తి అక్టోబరు 15న ఇండిగో విమానంలో న్యూఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో దిగిన తరువాత ఆయన టార్మాక్ వద్ద నిలిపి ఉన్న బస్సుల వద్దకు వెళ్లారు. తీవ్రమైన ఎండ ఉండటంతో వేడికి తాళలేకపోయిన ఆయన అక్కడికి దగ్గర్లోని చెట్టువద్ద నిల్చున్నారు.
అయితే, ఆయన 'నో ఎంట్రీ జోన్'లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. దీంతో ఆయనతో వారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దీనికి ‘‘మీ పని మీరు చూసుకోండి’’ అంటూ సమాధానం చెప్పి వెళ్లి పోతున్న ఆయనను, వెనుకకి లాగేసిన సిబ్బంది, కిందపడేసి, ఆయన తలపై ఒకడు కాలు పెట్టగా, మరొకడు ఆయన ముఖంపై గుద్దాడు. కొంతసేపటి తరువాత మరొక వ్యక్తి వచ్చి వారి నుంచి అతనిని విడిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక టీవీ ఛానెల్ ప్రసారం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.