nirbhay: భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం.. 'నిర్భయ్'!
- భారత ఆయుధాల అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి
- కేవలం 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించగల క్షిపణి
- 24 రకాల వార్ హెడ్ లను ఎత్తుకెళ్లగల సామర్థ్యం
భారత్ అమ్ములపొదిలో 'నిర్భయ్' క్షిపణి వచ్చి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘నిర్భయ్’ని మంగళవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 300 కిలోల వార్ హెడ్లను మోయగలిగిన సామర్థ్యంతో 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడమే లక్ష్యంగా దీనిని తయారు చేశారు. ఇది దీర్ఘశ్రేణి సబ్ సొనిక్ మిసైల్. 0.7 మాక్ వేగాన్ని ఈ క్షిపణి అందుకోగలదు. అతితక్కువ ఎత్తులో ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించడం దీని ప్రత్యేకత. కేవలం 100 మీటర్ల ఎత్తులో దూసుకెళ్లి ప్రత్యర్థి స్థావరాలను నేలమట్టం చేస్తుంది.
అంతేకాకుండా, ఇది 24 రకాల వార్ హెడ్ లను ఎత్తుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. వాస్తవానికి దీనిని దాదాపు నాలుగేళ్లక్రితం మొదలుపెట్టారు. అయితే ఆరంభ దశలోనే వరుసగా మూడుసార్లు వైఫల్యాలివ్వడంతో ఈ ప్రయోగాలను స్తంభింపజేశారు. అయితే సుదూర లక్ష్యాలే కాకుండా మధ్యశ్రేణి లక్ష్యాలను కూడా నాశనం చేసేందుకు ‘నిర్భయ్’ క్షిపణిని తయారు చేయాలని రక్షణ రంగ అధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మళ్లీ ముందుకు నడిపించారు. దీంతో దీనిని ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ సారి ‘నిర్భయ్’ క్షిపణి పరీక్షను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డీఆర్డీవో శాస్త్రవేత్తలు కొన్ని మార్పులు, చేర్పులతో దీనిని విజయవంతంగా పరీక్షించారు.