Narendra Modi: ఫలించిన మోదీ ప్లాన్.. వెనక్కి తగ్గిన డీఎంకే!
- కరుణను మోదీ కలవడం వెనుక రాజకీయ కోణం
- బీజేపీ, డీఎంకేల మధ్య చిగురిస్తున్న స్నేహం?
- కరుణను తన ఇంట్లో రెస్ట్ తీసుకోమన్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ చతురత ఫలించింది. తమిళనాట అడుగుపెట్టాలని భావిస్తున్న బీజేపీ... అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఓ వైపు అన్నాడీఎంకేతో కలుపుగోలుగా ఉంటూనే, మరోవైపు డీఎంకేకు సన్నిహితంగా మారేందుకు యత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లిన మోదీ... డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించారు. అంతేకాదు, "మీరు ఢిల్లీ వచ్చి నా అధికార నివాసంలో ఉంటారా? నా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారా?" అంటూ కరుణను అడిగారు. మోదీ మాటకు కరుణ చిరునవ్వు నవ్వారు. ఇదే సమయంలో కరుణ భార్య దయాళు అమ్మాళ్ ను కూడా మోదీ పరామర్శించారు. కరుణ కుమారుడు స్టాలిన్ చేయిపట్టుకుని నడుస్తూ, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో కరుణ కుమార్తె కనిమొళి కూడా అక్కడే ఉన్నారు.
ఈ వ్యవహారమంతా బీజేపీ రాజకీయ భవిష్యత్ అవసరాలను తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ వచ్చి తన నివాసంలో రెస్ట్ తీసుకోవాలంటూ మోదీ అనడం వెనుక రాజకీయ కోణం ఉందని వారు చెబుతున్నారు. 2004 దాకా బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేలో డీఎంకే భాగస్వామిగా ఉండేది. ఆ తర్వాత యూపీఏ వైపు మళ్లారు కరుణానిధి. డీఎంకేతో రాజకీయ పొత్తు బీజేపీకి అవసరం కాగా... కేసుల నుంచి బయటపడటానికి బీజేపీతో స్నేహం డీఎంకేకు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. కనిమొళి, దయాళు అమ్మాళ్, కరుణ బంధువర్గం, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తదితరులు నిందితులుగా ఉన్న 2జీ స్పెక్ట్రం కేసు కొద్ది రోజుల్లోనే తుది విచారణకు రానుండటం గమనార్హం.
ఏదేమైనప్పటికీ, మోదీ రాజకీయ మంత్రాంగం ఫలించింది. ఈ రోజు నిర్వహించ తలపెట్టిన నోట్ల రద్దు వ్యతిరేక ప్రదర్శనలను డీఎంకే విరమించుకుంది.