ingigo: రోజూ ఏదో ఒక గోలేంటి?: ఇండిగోపై సీరియస్ అయిన అశోక్ గజపతిరాజు
- రెండు రోజుల క్రితం పీవీ సింధు వివాదం
- ఆపై ప్రయాణికుడిని కొట్టిన సిబ్బంది
- వెంటనే సమన్లు ఇచ్చి నివేదిక పంపండి
- ఆదేశించిన అశోక్ గజపతి రాజు
ఇటీవలి కాలంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పట్ల అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన వివాదం సద్దుమణగకముందే, తమను ప్రశ్నించిన ఓ ప్రయాణికుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి, కిందపడేసి కొట్టిన ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రవర్తనపై దేశవ్యాప్త విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీవీ సింధూ విషయంలో తప్పు ఆమెదేనని వివరణ ఇచ్చిన ఇండిగో, తాజా ఘటనపై మాత్రం, సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ, ఇండిగోపై ప్రయాణికులు, నెటిజన్ల ఆగ్రహం తగ్గలేదు. గౌరవించుకోవాల్సిన ప్రయాణికులపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తీవ్రంగా స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఆయన, దాడికి పాల్పడిన వారికి సమన్లు జారీ చేయాలని, వారి వివరణ తీసుకుని, వారిపై ఏ చర్యలు తీసుకున్నారన్న విషయాన్ని తనకు తెలియజేయాలని ఆదేశించారు.
ప్రయాణికులు ఏవైనా అనుచిత ఘటనలకు పాల్పడ్డప్పుడు ఎంత తీవ్రంగా చర్యలు తీసుకుంటామో, ఎయిర్ లైన్స్ సిబ్బంది అటువంటి ఘటనలకు పాల్పడితే ఇంకా సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యమూ ఏదో ఒక వివాదమేంటని ఇండిగో ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది.