twitter: జపనీస్, కొరియన్, చైనీస్ తప్ప... ట్విట్టర్ లో కొత్త సౌకర్యమిది!
- అందుబాటులోకి వచ్చిన 280 అక్షరాల పరిమితి
- గత సెప్టెంబర్ లో అధికారికంగా ప్రకటించిన ట్విట్టర్
- పరిశీలన దశలోనే పెంచిన పరిమితి వాడేసిన ట్రంప్
ప్రస్తుతమున్న 140 అక్షరాల పరిమితిని 280 అక్షరాలకు పెంచుతామని గత సెప్టెంబర్ లో ప్రకటించిన ట్విట్టర్, ఈ తెల్లవారుజామున దాన్ని అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై తమ కస్టమర్లు అభిప్రాయాలను మరింత వివరంగా, సులువుగా తెలిపే వీలును కల్పిస్తున్నట్టు పేర్కొంది.
కాగా, జపనీస్, కొరియన్, చైనీస్ భాషలకు మాత్రం ఈ సదుపాయం వర్తించదని, మిగతా అన్ని భాషలకూ వర్తిస్తుందని తెలిపింది. ఈ పరిమితి పెంపు పరిశీలన దశలోనే ఎంతో మంది 280 అక్షరాలను వాడుతూ ట్వీట్లు పెట్టారని, వారిలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారని ట్విట్టర్ పేర్కొంది. ఇదిలావుండగా, ట్విట్టర్ అందుబాటులోకి వచ్చి 11 సంవత్సరాలు కాగా, అక్షరాల పరిమితిని పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.