virat kohli: ధోనీని విమర్శిస్తున్న వారిపై కోహ్లీ ఫైర్
- వయసును చూసే ధోనీని విమర్శిస్తున్నారు
- ఫిట్ నెస్, ఆటను మాత్రమే చూడాలి
- భారీ షాట్లు ఆడే అవకాశం టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లకే ఉంటుంది
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్ లో విఫలమైన ధోనీపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు చేస్తున్నవారిపై కెప్టెన్ కోహ్లీ విరుచుకుపడ్డాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో విఫలమైనా తనను విమర్శించరని... ఇదే సమయంలో ధోనీ విఫలమైతే మాత్రం విమర్శించడం చేస్తున్నారని మండిపడ్డాడు. దీనికి కారణం ధోనీ వయసే కదా? అని ప్రశ్నించాడు. వయసుతో సంబంధం లేకుండా ఆటగాడు ఫిట్ గా ఉన్నాడా? లేదా? అనే విషయాన్ని మాత్రమే చూడాలని సూచించాడు.
జట్టు విజయం కోసం ధోనీ ఏదో ఒక రూపంలో పాటుపడుతున్నాడని కోహ్లీ అన్నాడు. ధోనీకి బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రాకపోవడమే ఆయన విఫలం కావడానికి కారణమని చెప్పాడు. రన్ రేట్ కూడా ఆటగాడిపై ప్రభావం చూపుతుంటుందని అన్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లలో ధోనీ అద్భుతంగా రాణించాడని తెలిపాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే ఆటగాళ్లకన్నా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగేవాళ్లకే భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుందని చెప్పాడు. ధోనీ వైఫల్యాలపై వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ లు స్పందిస్తూ, త్వరలోనే రిటైరై, యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని సూచించారు.