paripoornananda: దేశద్రోహి కమల హాసన్ లాంటి వారిని నేను మరోసారి హెచ్చరిస్తున్నా: పరిపూర్ణానంద
- కమల్ మాత్రమే కాదు ఆయనను ప్రేరేపిస్తోన్న వారందరూ దేశ ద్రోహులే
- ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఊరుకోబోము
- ఏ భాషవాడితే వారికి అర్థం అవుతుందో అదే భాషలో చెబుతాం
- ఇక రాష్ట్రీయ హిందూ సేన ప్రతి మారుమూల గ్రామానికి వెళుతుంది
రాష్ట్రీయ హిందూ సేనను స్థాపించిన శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద తమ సేన తరఫున మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద పరిపూర్ణానంద మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి 10 వేల మంది యువతతో రాష్ట్రీయ హిందూ సేన సమగ్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. మొదట తెలంగాణ మీద దృష్టి పెట్టామని అన్నారు. తెలంగాణ యువత హిందూ ధర్మాన్ని కాపాడే వేదిక కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.
హిందూ తీవ్రవాదం అంటూ వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ పై స్వామి పరిపూర్ణానంద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కమలహాసన్ కాదని కమల్‌హుస్సేన్ అయిపోయాడని ఎద్దేవా చేశారు. ఈయన వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సి ఉందని చెప్పారు.
ఆయనకు హిందూ దర్మం ఏ ద్రోహం చేసిందని, అతివాదం ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు. ముస్లింలు, క్రిస్టియన్లలో అతివాదం లేదా? హిందువుల్లోనే ఉందా? అని నిలదీశారు. కమలహాసన్ వెనుక ఎవరున్నారన్న విషయాన్ని గర్తించాలని తాము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి లేఖ పంపనున్నట్లు తెలిపారు.
తాను కమల హాసన్‌లాంటి వారిని మరోసారి హెచ్చరిస్తున్నానని అన్నారు. హిందుత్వం, హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే హిందువులతో సఖ్యతతో ఉండాలని, ఒకవేళ ఇతరులకు అమ్ముడు పోతే వారితోనే బతకండని అన్నారు. హిందూధర్మం, హిందూ పద్ధతుల మీద మాట్లాడితే మాత్రం సహించబోమని అన్నారు. ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెబుతామని చెప్పారు. ఏ భాషవాడితే వారికి అర్థం అవుతుందో అదే భాషలో చెబుతామని హెచ్చరించారు.
తాము భగవద్గీతను చదువుకున్నామని, సహనంగా ఎలా ఉండాలో తెలుసని, అలాగే సహనం కోల్పోతే ఏం చేయాలో కూడా తెలుసని అన్నారు. కమల హాసన్ జాతీయ గీతాలాపనను కూడా హేళన చేశారని అన్నారు. కమల్ లాంటి వారు చేస్తోన్న వ్యాఖ్యలను ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళతామని అన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడేవారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కమలహాసన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే ఊరుకోబోమని అన్నారు.
కమలహాసన్ మాత్రమే కాదని, కమలహాసన్‌ను ప్రేరేపిస్తోన్న వారందరూ దేశ ద్రోహులేనని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. హిందూత్వంపై ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవ్వరైనా సరే దేశ ద్రోహులేనని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్మం, దేశం మనది అని యువత ఉత్సాహంతో ఉరకలు వేస్తోందని తెలిపారు.