Narendra Modi: యూపీఏకు షాక్.. మోదీ గూటికి డీఎంకే?
- యూపీఏను వీడనున్న డీఎంకే
- శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
- అన్నాడీఎంకే కంటే డీఎంకేనే బెటరంటున్న బీజేపీ అధిష్ఠానం
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సారథ్యంలోని యూపీఏకు షాకిచ్చేందుకు డీఎంకే సిద్ధమైంది. అతి త్వరలో ఎన్డీఏ గూటికి చేరనుంది. డీఎంకే అధినేత కరుణానిధిని రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ కలవడం చర్చనీయాంశమైంది. ఈ భేటీ వెనక ఏదో మర్మం ఉందని విశ్లేషకులు అనుమానించారు. అదిప్పుడు నిజం కాబోతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బాటలోనే కరుణానిధి కూడా నడవనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాల్లో ఉన్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రధాని మోదీతో భేటీ కోసం ఆగమేఘాల మీద తిరిగి రావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అంటున్నారు.
2జీ కుంభకోణం కేసులో కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కణిమొళి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీలోని పాటియాలా కోర్టు ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ తీర్పును డిసెంబరు 5 వరకు వాయిదా వేశారు. ఇదే కేసులో కేంద్రమాజీ మంత్రి రాజా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తీర్పు కనుక వెలువడితే కనిమొళి రాజకీయ జీవితం దాదాపు అంతమవుతుంది. రాజ్యసభకు అనర్హురాలవడంతోపాటు 11 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు.
ఇక బీజేపీ అంటేనే మండిపడే కరుణానిధి పరిస్థితిలో ఇటీవల ఎంతోమార్పు కనిపిస్తోంది. మోదీతో భేటీ అనగానే విదేశాల్లో ఉన్న స్టాలిన్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ప్రధాని మోదీతో కనిమొళి నవ్వుతూ మాట్లాడారు. కరుణానిధిని మోదీ కలవబోతున్నారన్న విషయం చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంది. ‘దినతంతి’ పత్రిక గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఒక్కటే ప్రధాని షెడ్యూల్లో ఉంది. కరుణతో భేటీ విషయం అందులో లేదు. వీటిన్నింటినీ చూస్తుంటే ఎన్డీఏ గూటికి డీఎంకే చేరడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు అంతర్గత కలహాలతో కల్లోలంగా ఉన్న అన్నాడీఎంకే కంటే డీఎంకేతో వెళ్లడమే మేలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఎన్డీఏలో చేరికను కరుణ ప్రకటిస్తారు.