T20: టీ20 చరిత్రలో ఘనమైన రికార్డ్.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పది వికెట్లు తీసిన రాజస్థాన్ కుర్రోడు!
- ఆకాశ్ నిప్పులు చెరిగే బంతులకు బ్యాట్స్‌మెన్ బెంబేలు
- 36 పరుగులకే కుప్పకూలిన బ్యాటింగ్
- ఇదే రికార్డులో హాట్రిక్ కూడా నమోదు
పొట్టి క్రికెట్లో మరో అరుదైన, ఘనమైన రికార్డు నమోదైంది. ఓ టోర్నమెంటులో ఓ కుర్రాడు ఏకంగా పదికి పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అది కూడా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా. జైపూర్‌లో జరిగిన భవేర్ టీ20 ఇందుకు వేదికైంది. దిశా క్రికెట్ అకాడమీ తరపున ఆడుతున్న 15 ఏళ్ల ఆశాష్ చౌదరి తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి పెరల్ అకాడమీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.
157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పెరల్ అకాడమీ ఆకాశ్ నిప్పులు చెరిగే బంతులకు 36 పరుగులకే కుప్పకూలింది. వేసిన తొలి మూడు ఓవర్లలో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టిన ఆకాశ్ చివరి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇందులోనూ చివరి మూడు బంతులకు హాట్రిక్ నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో (టెస్టుల్లో) అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ ఇలా పదికి పది వికెట్లు తీశారు.