China: మూడో ప్రపంచయుద్ధంలో చైనా మద్దతు మాకే: ఉత్తరకొరియా ప్రొఫెసర్ విశ్లేషణ
- పశ్చిమ దేశాల స్నేహాన్ని చైనా ప్రజలు అంగీకరించరు
- ఎన్నో ఏళ్లుగా తమ రెండు దేశాల ప్రజలు కలిసి ఉంటున్నారు
- అంతిమ విజయం తమదే అంటున్న ఉ.కొరియా ప్రొఫెసర్
గతకొంత కాలంగా అమెరికా, ఉత్తరకొరియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉత్తరకొరియాపై అమెరికా దాడికి సర్వం సిద్ధం చేసిందని, అందులో భాగంగానే ట్రంప్ ఆసియా పర్యటన చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉత్తరకొరియాను ఏకాకిని చేయాలంటే ఆ దేశానికి చైనాను దూరం చేయాలని, ఈ నేపథ్యంలోనే ట్రంప్ పర్యటన జరుగుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలోనే ఉత్తరకొరియాపై దాడి విషయంలో స్పష్టమైన సంకేతాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది. దీనికి బలం చేకూర్చుతూ ఉత్తరకొరియా ప్రొఫెసర్ డాక్టర్ లియోనిడ్ పెట్రోవ్ వ్యాఖ్యలు చేశారు.
మూడో ప్రపంచ యుద్ధంలో చైనా తప్పకుండా పాల్గొంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా, చైనాల మధ్య బంధం బలపడుతున్నప్పటికీ...యుద్ధం వస్తే చైనా తమకే మద్దతు పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధాలు, సైనిక బలం ఎంతగా ఉన్నప్పటికీ యుద్ధంలో అంతిమ విజయం మాత్రం తమదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒకవేళ చైనా తమను నిర్లక్ష్యం చేసి, అమెరికాకు మద్దతు పలికితే మూడో ప్రపంచ యుద్ధంలో ప్రాంతీయ అశాంతి రేగుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా చైనా, ఉత్తరకొరియా ప్రజల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. పశ్చిమ దేశాల స్నేహన్ని చైనా ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడరని ఆయన చెబుతున్నారు. అందువల్ల చైనా మద్దతు తమకే ఉంటుందని ఆయన తెలిపారు.