jaya tv: శశికళ వదిన ఇళవరసి ఇంటిపైనా ఐటీ దాడులు!
- జయ టీవీ ఆఫీసులో కొన్ని పత్రాల్లో ఇళవరసి ప్రమేయంపై ఆధారాలు
- మొత్తం 80 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
- 'నమదు ఎంజీఆర్' పేపర్ ఆఫీసుపైనా ఐటీ దాడులు
తమిళనాడులో ఈ ఉదయం నుంచి దివంగత ముఖ్యమంత్రి జయలలిత సొంత టీవీ చానల్ 'జయా టీవీ'పై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ లభించిన కొన్ని పత్రాల ఆధారంగా, శశికళ వదిన ఇళవరసి ఇంటిపైనా ఇప్పుడు అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ ఉదయం శశికళ బంధువులైన దినకరన్, దివాకర్, వారి బంధువుల ఇళ్లలో తనిఖీలు జరుపుతున్న అధికారులు, ఇళవరసి ఇంటికీ వచ్చారు. మొత్తం 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
జయ టీవీ యాజమాన్యం పన్ను ఎగవేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలను సేకరించిన తరువాత ఈ దాడులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జయ టీవీతో పాటు 'నమదు ఎంజీఆర్' పత్రిక ఆఫీసుపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాగా, జయలలిత మరణం తరువాత జయ టీవీ నిర్వహణను శశికళ తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇళవరసి కూడా శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.