kishan reddy: కేసీఆర్, మజ్లిస్ పార్టీలపై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- ఎంఐఎం మతతత్వ పార్టీ
- సీఎంలను భుజాన మోస్తూ, ఆస్తులను కూడబెట్టడమే ఎంఐఎం నేతల పని
- ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతోందా?
మైనార్టీల కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, టీఆర్ఎస్ పార్టీనే మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతోందంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే పార్టీ ఎంఐఎం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం, ఆ పార్టీ సీఎంలను భుజాలకు ఎత్తుకోవడం ఎంఐఎం నేతల పని అని విమర్శించారు.
పాలక పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ, ఆస్తులను కూడబెట్టుకునే కుటుంబ పార్టీ ఎంఐఎం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతోన్మాదాన్ని పెంచి పోషించే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందా? అని కిషన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే... ఎన్నికల్లో కలసి పోటీ చేసి, గెలుస్తామంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, కేసీఆర్ మౌనంగానే కూర్చున్నారని... ఆయన మౌనానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని చెప్పారు.