Jagan: ఎన్నికల సమయంలో మద్దతు ధర ప్రకటిస్తాను: మరో హామీ ఇచ్చిన జగన్
- పాదయాత్రలో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో రైతులతో జగన్ భేటీ
- కచ్చితమైన హామీని ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగుతాం
- ఏపీ సర్కారు రైతు రుణమాఫీని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు
రాబోయే ఎన్నికల సమయంలో ప్రతి పంటకు మద్దతు ధర ఇంత అని చెబుతూ తాము ముందే రేట్లను ప్రకటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితిని రానివ్వబోమని చెప్పారు. కచ్చితమైన హామీని ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగులో పాదయాత్ర కొనసాగిస్తోన్న వైఎస్ జగన్ వై.కోడూరు జంక్షన్లో రైతులతో భేటీ అయ్యారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను కల్పించకపోవడమే కాకుండా రైతు రుణమాఫీ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని, రైతుల బాధలు ఆయనకు అర్థం కావడం లేదని అన్నారు. రైతుల నుంచి బ్రోకర్లు పంటలను తక్కువ ధరలకే కొనుగోలు చేసి అనంతరం ధర అమాంతం పెంచుతున్నారని చెప్పారు.