swamiji: శివలింగంపై కాళ్లు పెట్టిన స్వామీజీపై కేసు నమోదు!
- శివలింగంపై కాళ్లు పెట్టి పూజలు చేసిన శాంతలింగేశ్వరస్వామి
- వీరశైవ సంప్రదాయంలో భాగంగానే పూజలు చేసినట్టు వివరణ
- బెంగళూరులో స్వామిపై కేసు నమోదు
కర్ణాటకలోని బెంగళూరులో శివలింగంపై కాళ్లు పెట్టి పూజలు చేసిన శాంతలింగేశ్వర స్వామీజిపై పోలీసు కేసు నమోదైంది. ఈ నెల 5న బెంగళూరులోని ఒక శివాలయంలో స్వామీజీ శివలింగంపై కాళ్లు పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు గాయపరిచారంటూ శాంతలింగేశ్వర స్వామిపై బెంగూళూరు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై స్పందించిన శాంతలింగేశ్వరస్వామి శిష్యులు.. స్వామివారు చేసింది తప్పు కాదని అన్నారు. వీరశైవమత సిద్ధాంతం ప్రకారం స్వామి పూజలు చేశారని అన్నారు. రాతి నుంచి విగ్రహంగా మారిన లింగానికి ప్రాణప్రతిష్ఠ చేయడంలో పాదాలతో పూజ చేయడం వీరశైవ సంప్రదాయమని వారు స్పష్టం చేశారు. ఈ పూజలు దొంగచాటుగా జరగలేదని, భక్తుల సమక్షంలో, వీరశైవ సంప్రదాయం ప్రకారమే నిర్వహించామని అన్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో తెరవేసి పూజలు చేస్తారని గుర్తు చేసిన వారు ఈ పూజలన్నీ భక్తుల సమక్షంలోనే చేశారని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు.