GST council: నేడు జీఎస్టీ ఊరట... 200 వస్తువుల ధరలు తగ్గే చాన్స్... అంచనాలివి!
- గౌహతిలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- హిమాంత అధ్యక్షతన ఏర్పడిన కమిటీ సిఫార్సులపై చర్చ
- పలు ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశాలు
గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతుండగా, 28 శాతం పన్ను పరిధిలో ఉన్న సుమారు 200కు పైగా వస్తువుల ధరలను తగ్గిస్తూ, కీలక నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఏఏ వస్తువుల ధరలను పన్ను పరిధిలో కిందకు దించాలన్న విషయమై ఆర్థికమంత్రి అధ్యక్షతన సమావేశమైన కౌన్సిల్ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ప్రకటన వెలువడవచ్చని సమాచారం.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, చేత్తో తయారు చేసిన ఫర్నీచర్, షాంపూలు, శానిటరీ వేర్, సూట్ కేసులు, వాల్ పేపర్లు, ప్లైవుడ్, స్టేషనరీ ఉత్పత్తులు, గడియారాలు, ఆట వస్తువులు తదితరాలపై పన్ను శ్లాబ్ దిగివస్తుందని తెలుస్తోంది. ఇదే సమయంలో రెస్టారెంట్లలో సర్వ్ చేసే ఆహారంపైనా పన్ను తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
అసోం ఆర్థికమంత్రి హిమాంత బిశ్వ శర్మ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, పన్ను శ్లాబ్ తగ్గించాల్సిన వస్తువుల జాబితాను తయారు చేసింది. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్ల మధ్య తేడా ఉండాలని కూడా ఈ కమిటీ కోరింది. స్టార్ హోటల్ అద్దె గదుల విషయంలో రూ. 7,500 మించితేనే పన్ను వసూలు చేయాలని, అది కూడా ఒకేలా ఉండాలని సిఫార్సు చేసింది. కోటి రూపాయల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులపై కంపోజిషన్ స్కీమ్ అమలు చేయాలని కోరింది. ఈ కమిటీ సిఫార్సులపై చర్చ అనంతరం జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాలు ప్రకటిస్తుంది.