vinayak: పని చేయించుకుని క్రెడిట్ ఇవ్వకపోవడం నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది : వినాయక్
- ఇండస్ట్రీలో ఎదిగిన తరువాతనే డబ్బు వస్తుంది
- ఎదగాలంటే ముందు మంచి పేరు రావాలి
- ఆ క్రెడిట్ కోసమే అంతా కష్టపడుతుంటారు
- అది ఇవ్వకపోవడం తప్పు
"నేను ఫలానా సినిమాకి ఫలానా వర్క్ చేశాను .. అయినా నాకు క్రెడిట్ ఇవ్వలేదు" అని చెప్పేసి బాధపడేవాళ్లు కొంతమంది ఇండస్ట్రీలో కనిపిస్తుంటారు. ఇలా క్రెడిట్ పొందలేని వాళ్లలో కొంతమంది పరిస్థితులను బట్టి సైలెంట్ గా వుండిపోతే, మరికొంతమంది ఫైట్ చేస్తుంటారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి వినాయక్ స్పందించారు.
" ఇండస్ట్రీకి ఎవరైనా సరే గుర్తింపు కోసమే వస్తారు. పని చేయించుకుని క్రెడిట్ ఇవ్వకపోవడమనేది చాలా తప్పు. డబ్బు అనేది ఎదిగిన తరువాత వస్తుంది .. ఎదగాలంటే మంచి పేరు రావాలి .. అందువల్లనే అందరూ ముందుగా ఫోకస్ పెట్టేది పేరు మీదనే. ఈ క్రియేటివిటీ ఫీల్డ్ లో మంచి పేరు తెచ్చుకోవాలనే ఎవరికైనా ఉంటుంది. ఆ తరువాత పేరుతో పాటు డబ్బు వస్తుంటుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇవ్వాలి. తాము పనిచేసిన సినిమా నుంచి క్రెడిట్ పొందలేని వాళ్లు నా దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది" అని వినాయక్ చెప్పుకొచ్చారు.