assembly: ఏడాదిలోపు పట్టిసీమ పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని కొందరన్నారు!: అసెంబ్లీలో చంద్రబాబు
- అసెంబ్లీలో నదుల అనుసంధానం, పట్టిసీమపై చర్చ
- పట్టిసీమ ప్రారంభిస్తానని నేను చెబితే కొంతమంది హేళన చేశారు
- పట్టిసీమపై కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిలిపి వేయాలని కుట్రలు పన్నారు
- అయినప్పటికీ పట్టిసీమ పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపాం
మనరాష్ట్రం ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో నదుల అనుసంధానం, పట్టిసీమపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కర్ణాటక, తమిళనాడులో 15 టీఎంసీల నీటి కోసం ధర్నా చేశారని, ఆ పరిస్థితి మనకు రాదని, నదుల అనుసంధానంతో నీటి సమస్య ఉండదని చెప్పారు.
గోదావరి నుంచి ఏటా 2650 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని, నీటిని కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. పట్టిసీమ ప్రారంభిస్తానని తాను చెబితే కొంతమంది హేళన చేశారని అన్నారు. ఏడాదిలోపు పట్టిసీమ పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని కొందరు చెప్పారని, తాను ఓ సంకల్పం తీసుకుని ముందుకెళ్లానని అన్నారు. పట్టిసీమపై కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిలిపి వేయాలని కుట్రలు పన్నారని అన్నారు. అయినప్పటికీ పట్టిసీమ పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపామని అన్నారు.
అదే విధంగా అన్ని పనులు పూర్తి చేస్తూ వెళతామని చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను కృష్ణాకు తీసుకొస్తున్నామని చెప్పారు. పోలవరం పూర్తయితే రైతుల కష్టాలన్నీ తీరుతాయని తెలిపారు. చంద్రబాబు ప్రసంగం తరువాత శాసనసభ రేపటికి వాయిదా పడింది.