university of pune: పూణే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ రావాలంటే శాకాహారులై ఉండాలట!

  • వెజిటేరియన్లు, నాన్ డ్రింకర్స్ కు మాత్రమే గోల్డ్ మెడల్ నిబంధన తెచ్చిన యూనివర్సిటీ ఆఫ్ పూణే
  • 'షెలార్ మామ' పేరుమీద గోల్డ్ మెడల్ అందిస్తున్న యూనివర్సిటీ 
  • ఎంపీ సుప్రియా సూలే విమర్శలు 

సాధారణంగా యూనివర్సిటీ నిర్వహించే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వడం ఆనవాయతీ. అయితే సావిత్రీభాయ్ పూలే పూణే యూనివర్సిటీ ప్రకటన మాత్రం.. గోల్డ్ మెడల్ పొందడానికి చదువుతో పాటు మరికొన్ని వ్యక్తిగత అర్హతలు కూడా వుండాలన్నట్టు పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ యూనివర్సిటీ చేసిన ప్రకటన ఏంటంటే... 'మహారిషి కీర్తంకర్ షెలార్ మామ' పేరిట గోల్డ్ మెడల్ పొందే విద్యార్థులు వెజిటేరియన్లు, మద్యం సేవించని వారై ఉండాలని, అలాంటి విద్యార్థులకు మాత్రమే గోల్డ్‌ మెడల్‌ ఇస్తామని పేర్కొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మన విశ్వవిద్యాలయాలకు ఏమైంది? మెరిట్‌ విద్యార్థుల మాటేమిటి? అందరినీ ఒకే విధంగా చూస్తూ, నాణ్యమైన విద్యను అందించండి. విద్యార్థులను ఎందుకు విడదీస్తున్నారు? పూణే యూనివర్సిటీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఈ వార్త విని ఆశ్చర్యపోయాను’ అంటూ ఆమె పేర్కొన్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలు విద్యమీద దృష్టిపెడుతున్నాయా? లేక తిండి మీద దృష్టిపెడుతున్నాయా? అంటూ విమర్శలు వస్తున్నాయి.

అయితే దీనిపై యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. గోల్డ్ మెడల్ రావాలంటే ఉన్న పది షరతుల్లో విద్యార్ధి అర్హతల్లో 'శాకాహారం మద్యం సేవించకపోవడం' అన్నది ఏడవ షరతని తెలిపింది. యూనివర్సిటీ ఇచ్చేగోల్డ్ మెడల్ కు స్పాన్సర్ ఉంటారని తెలిపారు. వ్యక్తిగతంగా యూనివర్సిటీ మెడల్స్ ఇవ్వనందున, స్పాన్సర్ పెట్టే నిబంధనలను దానికి అర్హతలుగా సూచిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News