Philippines: అప్పట్లో నేనొకడిని పొడిచి చంపా.. జైలుకెళ్లడం, రావడం నాకు మామూలే!: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
- తనను కలవాలని ప్రయత్నిస్తే ఐరాస ప్రతినిధి చెంపలు వాయిస్తానని హెచ్చరిక
- ఏడాదిలో లక్షమంది డ్రగ్స్ స్మగ్లర్లను చంపించిన రోడ్రిగో ప్రభుత్వం
- గతేడాదే అధికారంలోకి వచ్చిన రోడ్రిగో
తాను యువకుడిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లడం, రావడం అనేవి తనకు చాలా మామూలు విషయాలుగా ఉండేవని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ తెలిపారు. తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని పొడిచి చంపేశానని పేర్కొన్నారు. వియత్నాం నగరమైన డానాంగ్లో స్థానిక ఫిలిపినో కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐరాస ప్రతినిధి ఎవరైనా తనను కలిసేందుకు ప్రయత్నిస్తే, వారి చెంపలు వాయిస్తానని హెచ్చరించారు. డ్రగ్స్‌పై తాను ప్రకటించిన యుద్ధం గురించి ఎవరు మాట్లాడినా వదిలేది లేదన్నారు.
‘‘నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడే ఒకరిని చంపేశాను. ఇప్పుడు నేను అధ్యక్షుడిని’’ అని తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన రోడ్రిగో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా పారదోలుతానని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే అధికారం చేపట్టగానే డ్రగ్స్ స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేశారు. డ్రగ్స్‌తో ఎవరు కనిపించినా మరో మాటకు తావులేకుండా కాల్చి చంపాలని, తన కొడుకైనా సరే విడిచిపెట్టవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా ఈ ఏడాదికాలంలో దాదాపు లక్షమందిని చంపినట్టు అంచనా.
పోలీసులు మాత్రం తాము 3,967 మందిని చంపేశామని, మరో 2,290 మంది డ్రగ్ సంబంధ నేరాల్లో హత్యకు గురయ్యారని తెలిపారు. మిగతా వారి మరణాలపై లెక్క తేలాల్సి ఉంది.