tripple talaq: భార్యకు టకటకా మూడు సార్లు తలాఖ్ చెప్పిన ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్
- వాట్స్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా తలాక్ చెప్పిన ఖలీద్ బిన్ యూసుఫ్ ఖాన్
- న్యాయం జరగకపోతే వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితురాలు
- షరియత్ చట్ట ప్రకారమే తలాక్ చెప్పానంటున్న ప్రొఫెసర్
ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళలకు అన్యాయం చేయవద్దని సుప్రీంకోర్టు సూచించి రెండు నెలలు కూడా పూర్తికాకముందే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ తన భార్యకు టకటకా మూడుసార్లు తలాక్ చెప్పి కలకలం సృష్టించారు. దీనిపై బాధితురాలు యాస్మీన్ ఖలీద్ మాట్లాడుతూ, వచ్చే నెల 11వ తేదీలోగా తనకు న్యాయం జరగకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలిసి వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
విశ్వవిద్యాలయంలో సంస్కృతం శాఖకు చైర్మన్ గా ఉన్న తన భర్త తొలుత వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టి తలాక్ అన్నారని తెలిపారు. తరువాత టెక్స్ట్ మెసేజ్ పెట్టి తలాఖ్ చెప్పారని ఆమె వెల్లడించారు. తరువాత తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టారని, న్యాయం కోసం తాను యూనివర్సిటీలోని క్రింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందర్నీ వేడుకుంటున్నానని, అయినా తనకు ఎవరూ సహాయపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల సాయంతో తాను ఇంటికి వెళ్లగలిగానని ఆమె అన్నారు. కాగా, దీనిపై ప్రొఫెసర్ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ మాట్లాడుతూ, తాను షరియత్ చట్టప్రకారం విడాకులు పొందానని అన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ లతోపాటు ఇద్దరు సాక్షుల ఎదుట నోటి మాటల ద్వారా కూడా తలాక్ చెప్పానని ఆయన అన్నారు. దీనికి నిర్దేశించిన కాల పరిమితిని కూడా పాటించానని ఆయన తెలిపారు.