school girl: విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ... 700 కే ఇంటిని 24 గంటలు చల్లగా ఉంచే సాధనం!
- మధ్యప్రదేశ్ లోని ఆమలా గ్రామంలోని కన్యా హయ్యర్ సెకండరీ స్కూలులో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్న కిరణ్ వర్మ
- 700 రూపాయల ఖర్చుతో గదిని 24 గంటలు చల్లగా ఉంచే సాధనానికి రూపకల్పన
- సైన్స్ టీచర్ సహకారంతో తయారీ, ఎగ్జిబిషన్ లో ప్రదర్శన
మధ్యప్రదేశ్ లోని ఇంటర్ సెకెండ్ ఇయర్ విద్యార్థిని వినూత్న ఆవిష్కరణకు తెరదీసింది. అతితక్కువ ధరకు 24 గంటల పాటు గదిని చల్లగా ఉంచే సాధనాన్ని రూపొందించింది. దాని వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ లోని ఆమలా గ్రామంలోని కన్యా హయ్యర్ సెకండరీ స్కూలులో కిరణ్ వర్మ 12వ తరగతి చదువుతోంది. చదువులో చురుకైన కిరణ్ వర్మ ఎండాకాలంలో వేడిమి సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా చేయాలని భావించింది. సైన్స్ టీచర్ శైలేంద్ర సింగ్ సహకారంతో నూతన ఏసీ ఆవిష్కరణకు నాంది పలికింది. సుమారు 2 కేజీల ఐస్ ను వినియోగించి గదిని 24 గంటలపాటు చల్లగా ఉంచే విధానాన్ని రూపొందించింది.
ఒక చిన్న డ్రమ్ము తీసుకుని దాని పైభాగంలో చిన్న ఫ్యాను అమర్చింది. తరువాత పైభాగాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ డ్రమ్ముకు మధ్య మధ్యన అర అంగుళం మేర ఆరు రంధ్రాలను చేసింది. అక్కడ ఒక అడుగు పొడవు కలిగిన పైపులను అమర్చింది. డ్రమ్ము పైభాగాన నీరు పోసేందుకు ఏర్పాటు చేసి, అందులో ఐసు ముక్కలను వేసింది. దీంతో పైనున్న ఫ్యాన్ తిరుగుతుండడంతో.. డ్రమ్ముకు ఏర్పాటు చేసిన ఆరు పైపుల రంధ్రాల నుంచి చల్లని గాలి వెలువడింది. ఈ విధానంలో గది 24 గంటలపాటు చల్లగా ఉంటుందని తెలిపింది. దీనిని స్థానికంగా జరిగిన ఎగ్జిబిషన్ లో ప్రదర్శించింది. ఆమె రూపకల్పన చేసిన ఏసీకి 700 రూపాయలు ఖర్చవుతాయని వెల్లడించింది. దీంతో ఆమె ఆవిష్కరణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.